భక్తి వేదాంత రసాలు

పరమ విష్ణు భక్తుడయిన నారదుడు అక్షర తపస్వి కృష్ణద్వైపాయనుడు ఎదురెదురుగా ఉన్నారు. క్షణంసేపు యిరువురిలో మహామౌనం తాండవించింది. ఒకరి నేత్రాలలో జిజ్ఞాస, అవి నారదుని చూపులు, మరొకరి కందోయిలో అసంతృప్తి చేతన. అది వ్యాసుని దృష్టి ప్రసారం. నారదుడే వ్యాసుని విచారానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. అప్పుడు వ్యాసుడు ఇలా అన్నాడు:
"దేవర్షీ! సరస్వతీ కటాక్షం చేత రాశీభూతంగా ఉన్న వేదసముచ్ఛయాన్ని విభాగించి నాలుగు వేదాలుగా లోకానికి అందించగలిగాను. విజ్ఞాన సర్వస్వమయిన మహా భారతాన్ని రచించి తపస్వులకు నివేదనం చేశాను. శ్రీరామతత్వాన్ని విశ్లేషించి అధ్యాత్మ రామాయణాన్ని వేదాంతులకు జ్ఞానామృతంగా పంచాను. ఈ మహాసృష్టి కాలస్వరూపాన్ని వివరించే పద్దెనిమిది పురాణాలు వెలయించాను. ఇంక వాఙ్ఞ్మయం సృష్టించినా నాలో తృప్తి కలగలేదు. నాకు శాంతి లభించలేదు. నా సాహిత్య పిపాస తీరలేదు. ఏం చేస్తే నా అక్షర తపో సాధన సార్థకం అవుతుంది?"
వ్యాసుని మాటలు విన్న నారద మహర్షి మందహాసం చేసి యిలా అన్నాడు.
"కృష్ణద్వైపాయనా! శ్రుతివిహితమయిన రీతిలో సంచరించే ప్రాఙ్ఞులకు మాత్రమే వేదం అంది వస్తుంది. అసాధారణ ధీమంతులు మాత్రమే మహాభారతాన్ని ధారణ చేయగలరు. వేదాంత మనస్కులు మాత్రమే అధ్యాత్మ రామయణామృతాన్ని గ్రోలెదరు. ఇక పురాణాలంతావా అవి అక్షయ విషయ సంభవితాలు. కనుక సామాన్యులు వాటిలో ప్రవేశించలేరు. అంతమాత్రం చేత నీ అక్షర తపస్సు వృధా పోయినదని అర్థం కాదు. ఆ చంద్రతార్కారం. అది సాహితీ పథగాములకు ప్రాతః స్మరణీయాలే అవుతాయి. కానీ సామాన్య జనులు సులభంగా తరించడానికి ఙ్ఞాన వేదాంత భావాల్ని అవగతం చేసికొనడానికి ఉపయుక్తమైన మహా భాగవతాన్ని వ్రాయి. అది భక్తి వేదాంత రసాలమై అందరికీ ఉపకరిస్తుంది. నీకు చిత్తశాంతి లభిస్తుంది."

No comments:

Post a Comment